Monday, April 6, 2009

మాటల్లేని వేళ An Anthology of Poems


"ప్రళయాలకు కారకులు
అనాదిగా మనుషులే
బాధితులూ మనుషులే
శత్రువంటూ లేని కాలంలో
ప్రళయాలుండవు
మనసుతో బ్రతికినంత కాలం
మనుషులకు మరణాలుండవు" ఈ లైన్లను చూసి మాటల్లేని వేళ చదవడం మొదలెట్టా. పలమనేరు బాలాజి రాసిన 47 కవితల సంకలనమే ఈ మాటల్లేని వేళ. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆర్థిక సహాయం చేశారు అని పుస్తకం అట్టపైన ఉండడంతో ఇంకా ఆసక్తి పెరిగింది.

అంత్యక్రియలు అనే కవితలో
'చావుదేముంది
అదొక బహిరంగ కుట్ర
చావంటే
సమస్త అనుబంధాల్నుంచీ
చప్పున
తప్పుకొవటమే కదా'.. అంటూ చావును నిర్వచిస్తూనే,
'ఏ చావైనా నీలో
దుఃఖాన్ని కలిగించలేదంటే..
బహుశా నువ్వప్పటికే
మరణించి ఉంటావు '.... అంటూ నిష్టూరమాడుతాడు.

ఒక శీతాకాలపు సాయంత్రం అనే కవితలో...
'అడుగులు ముందుకు
మనస్సులు వెనక్కూ
లాగుతూనే ఉన్నాయి.
నిజానికి ఖాళీ అయ్యింది ఇల్లు కాదు
మేమే.'
అంటూ ఖాళీ చేసిన ఇంటి విశేషాలు వివరిస్తాడు. సరదాలు, తగాదాలు, పి.పి. కాల్స్, పోస్ట్మేన్, వాచ్ మేన్, ముగ్గులు అలా అన్నింటిని గుర్తుచేసుకుంటాడు.

ఒక అమ్మ మరణం అనే కవితలో
'మనిషి మరణంతో ఏర్పడ్డ ఖాళీలు
మనసున్నంత వరకు వుంటాయేమో' .. అని అనుమానం వెలిబుచ్చుతాడు.

ఇంకా విజన్ అనే కవితలో కష్టాల్లోని రైతును తలచుకుంటూ...
'అతడొక
మందుపాతరని
ముందే తెలుసు
పల్లెకు, నగరానికి
తేడా లేని కాలంలో
తాకట్టు పెట్టి పెట్టీ
అతడికిప్పుడు తలే లేదు
మిగిలిందల్లా
అప్పుల ఆనవాళ్ళే
ఇప్పుడతడు
గుప్పెడు గింజలు, పోగొట్టుకున్న పరపతి,
కాసిన్ని నీళ్ళు, కరెంటు
కావాలంటున్నాడు
పైరు పండితే చాలు
పచ్చదనంతో తల పైకెత్తుతాడు
దేబరించటం కాదు
డిమాండ్ చేస్తున్నాడు
అతడి పరపతి
అతడికి ఇవ్వాల్సిందే
లేదంటే
అతడొక మందుపాతరని
ముందే చెప్పా' అంటూ ముగిస్తాడు.

సృజనను, సృజనాత్మకతను వివరిస్తూ సృజనకారుడు లో
'విధ్వంసం తప్ప
ప్రతిదీ సృజనాత్మకమైనదే' అంటూ ఒకే ముక్కలో తేల్చేస్తాడు.

'ఇండ్లు
ఇండ్ల ముందర ఇండ్లు
ఇండ్ల వెనుక ఇండ్లు
ఇండ్ల పక్కన ఇండ్లు
ఊర్లన్నీ ఇండ్లతో నిండిపోతే
ఇండ్లన్నీ మనుషులతోనే మిగిలిపోతే
తిరుగాడేందుకు, ఆటలాడేందుకు,
మనిషితో మనిషి ఎదురుపడి
ముచ్చట్లాడేందుకు,
కష్టమో, సుఖమో, దుఃఖమో, ఆనందమో
పంచుకునేందుకు వీథులెక్కడ ?' అని వీథి లో ప్రశ్నిస్తూనే...
'నీకోసం ఇండ్లు నిర్మించు
నీకోసం ఊర్లు నిర్మించు
నీలాంటి వాళ్ళకోసం
నీలోని వాళ్ళకోసం
వాళ్ళలోని నీకోసం' అంటూ సమాధాన పరుస్తాడు.

మనిషితనం అన్న కవితలో
'మనిషితనాన్ని చూడాలంటే
మనం పల్లెటూరికి నడవాల్సిందే' అనడం... ఎందుకో మరి నేను పూర్తిగా ఏకీభవించలేకపోయా.
మానవుడు దానవుడైన వేళ, మానవత్వం మంట కలిస్తే, పల్లె అయిన పట్టణం అయిన ఒకటే కదా !

ఇక చివరగా మాటల్లేని వేళ అనే కవితలో
'మాట
ఒక చలన సూత్రం
ఒక వారధి, ఒక చర్య లేదా
ఒక వ్యూహం, ఒక మాయ' అని సూత్రీకరిస్తాడు.
'మనసున్న వాళ్ళతోనే మాట్లాడు
మనసున్న వాళ్ళతోటే జీవించు
మాటలే జీవన సౌరభాలు' అంటూ ముగిస్తాడు. మొత్తానికి నాకు ఈ పుస్తకం నచ్చింది :)

పుస్తకం : మాటల్లేని వేళ
రచయిత : పలమనేరు బాలాజి
వెల : రు.25
E-mail: knpalamanerbalaji@yahoo.co.in

2 comments:

చైతన్య said...

చాలా చాలా బాగున్నాయండి కవితలు... ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?

కొత్త పాళీ said...

nice job